భగవద్గీత

వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. మళ్ళీ ఆ భగవద్గీతకు సారమంటూ ఏమిటి? ఎందుకు? ఎందుకంటే... నేటి సమాజంలో... వ్యవస్థలో మనిషి జీవితం అతివేగవంతము, విరామరహితము అయిపోతూ... మంచి పుస్తకం చదవడానికి తీరికని మిగలనివ్వడం లేదు. డబ్బులు వెనుకా, పనుల వెనుకా, సుఖవిలాసాల వెనుకా పరుగుతీస్తున్న ఆధునిక మానవుడికి "సూక్ష్మంలో మోక్షం అందాలి".

శ్రీమద్భగవద్గీత - శ్రీ నిలయుడు - శ్రీమంతుడు - శ్రీనివాసుడు - శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారస్వరూపుడు శ్రీమన్నారాయణుడు లోకహితంకోసం విశ్వశ్రేయస్సును కాంక్షించి, హృదయంగమంగా చేసిన అద్భుతగానం అమృత గానం, అమర గానం, శాశ్వతసుధారసైక గానం, ఆత్మసాక్షాత్కార గానం! అందులో వేదాల సారముంది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన జ్ఞానమున్నది. కర్తవ్య నిర్వహణ ప్రబోధమున్నది. అనన్యభక్తి ఉన్నది. సర్వోత్తమ భావాలకు ఆకారమైయున్నది. సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైన శ్రీకృష్ణుడు - కుంతీకుమారుడగు పార్థునికి ఉపదేశించబడింది యీ గీతాగానం.

పరమాత్మ ముఖకమలంనుండి వెలువడిన అమృతగానమే - భగవద్గీత. భగవద్గీత - శ్రీకృష్ణ ఉవాచగా కాకుండా, భగవానువాచగా, ప్రసిద్ధికెక్కింది. ఇది మహాభారతాంతర్గతం కావటం చేత భారతానికి అంతరాత్మగా పెద్దలు ప్రవచించారు. గీతం అనగా గేయం. భగవద్గీతయనగా భగవానుని చేత స్వయంగా, గానం చేయబడింది. భగవానుడు జ్ఞానస్వరూపుడు. అందుచేత ఆయన భగవద్గీత ద్వారా లోకానికి అందించినది - ఆత్మజ్ఞానమనే అమూల్యరత్నభాండగారం. అదొక జ్ఞానసాగరం. వేదాలలో కర్మకాండ, ఉపాసనాకాండ అలాగే జ్ఞానకాండ చెప్పబడినాయి. జ్ఞానకాండమే ఉపనిషత్తులుగా వేదాంతంగా పెద్దలు చెబుతారు. ఉపనిషత్తుల సారమే - గీతాగానం అని, పెద్దల ఉవాచ

భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలని ఉన్నా ఆ గ్రంథం సైజుని చూసి భయపడి (సందేహించి) తామంత పుస్తకం చదవలేమని వదిలేస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సంగ్రహ సంక్షిప్త గీతాసారం ఈ దివ్యజ్ఞానము. దీనిని చదివినవారిలో కొందరయినా మూలాన్ని చదువతారనే ఆశ, ఆకాంక్ష, విశ్వాసాలతో దివ్యజ్ఞానము అందిస్తున్నాము. ఇది చదివాక మూలం చదవడానికి పాఠకులు భయపడకుండా ఉండాలనేదే ఈ స్మృతి వ్యాస శ్రుతి లక్ష్యం.

error: Content is protected !!